ఈ నెల 21 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల్లో వానలు కురిసే అవకాశం.
వాతావరణ మార్పుల ప్రభావం వల్ల వర్షాకాలంలో ఎండలు, ఎండాకాలంలో వర్షాలు వంటి అనిశ్చిత పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ కారణంగా ప్రజలకు ఎప్పుడు ఏం జరుగుతుందో అంతుబట్టడం లేదు.
ప్రస్తుతం పంటలు చేతికొచ్చే సమయంలో, ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. ఈ నెల 21 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల్లో వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు, పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.
తూర్పు విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ద్రోణి ప్రస్తుతం మరఠ్వాడా నుండి అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు విస్తరించింది. దీని ఫలితంగా, మార్చి 20 వరకు మధ్య తెలంగాణ, కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే విధంగా, జార్ఖండ్, ఒడిశా, విదర్భ, ఛత్తీస్‌గఢ్, తూర్పు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావం పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాలపై కూడా ఉండే అవకాశం ఉంది.
